Friday 4 December 2015

రవి మహాదశలో రాహువు అంతర్దశ ఫలితాలు

రాహువ లగ్నాత్తుగాని, దశాధినాతుని స్థానాత్తు గాని, శుభగ్రహయుతుడై శుభస్థానాల్లో శుభరాశినవాంశులలో ఉన్న.. వివాహము, అధికారుల ఆదరణ, సుఖములు, భాగ్యవృద్ధి, ఉద్యోగప్రాప్తి, ఆరోగ్యము, కీర్తి, పుత్రప్రాప్తి, మొదలైన శుభములు జరుగుతాయి. రాహువు పాపగ్రహములతో కలిసి అశుభస్థానాల్లో ఉంటే.. అకాల మృత్యువు, బంధు విరోధము, పదవీచ్యుతి, రక్తదోషం, పాపకార్యాసక్తి కలుగుతాయి.

            వీటితో పాటు కారాగార వాసం, కష్టాలు, రోగాలు, శిరోబాథ, దుఃఖములు, సర్పభయము మొదలైన అశుభాలు జరుగుతాయి. రాహువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు. రాహువు స్వంత స్థానంలో వుండి, శుభగ్రహయుతి కలిగి పాపగ్రహ సంబంధం లేకున్న యెడల  ఎక్కువగా శుభములన తన అంతర్దశలయందు ఇస్తాడు.

Thursday 3 December 2015

రవి మహాదశలో కుజాంతర్దశ ఫలితాలు

కుజుడు లగ్నాత్తుగాని, దశాథినాథుని స్థానాత్తుగాని 3,6,10,11 స్థానాల్లో శుభుడై ఉన్నప్పుడు.. భ్రాతృవృద్ధి, స్త్రీలాభం, విజయములు, బంధువుల వల్ల సుఖం, ఆభరణ ప్రాప్తి, అదికారుల అండదండలు, ధనవృద్ధి, ఆరోగ్యం, శుభకార్యములు, వ్యవసాయంంలో లాభం, భూమి సంపాదన, ఉద్యోగం, రాజకీయాల్లో అభివృద్ధి, సాహసకార్యాలు, శత్రువుపై విజయం, మొదలైన శుభకార్యాలు జరుగుతాయి. కుజుడు కేంద్రకోణంలో ఎక్కువశుభుడౌతాడు.

           కుజుడు దుస్థానములలో నిర్బలుడై ఉంటే భార్యకు అనారోగ్యం, అకాల మృత్యువు, వ్యవసాయంలో నష్టం, భ్రాతృవిరోధం, పదవీచ్యుతి, శత్రుభయం, కలహాలు, ఆస్తినష్టం, విద్యాహాని, రోగపీడలు, నేత్రరోగములు, పైత్యరోగం, అధికారుల వల్ల భయం, అపార్థాలు, అపజయములు మొదలైన నష్టాలు కలుగుతాయి. కుజుడు 2,7 స్థానాల్లో ఉన్నప్పటికీ, ఆ స్థానముల అధిపతి అయినను ప్రాణభీతి ఉంటుంది. 

Wednesday 2 December 2015

రవి మహాదశలో చంద్ర అంతర్దశా ఫలితాలు

 చంద్రుడు 1,3,4,5,7,9,10,11 స్థానాల్లో ఉన్నప్పుడు వివాహాది శుభకార్యములు, వాహనములు, సన్మానములు, భార్యాపుత్రులతో సుఖము, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట, శత్రువులపై విజయము, నూతన గృహ నిర్మాణము, కార్యసిద్ధి, ఉత్సాహము, సత్సాంగత్యము, మతాసక్తి, ఆరోగ్యం, విద్యాభివృద్ధి, వ్యవసాయం, పాడిపంటల వృద్ధి, ధనలాభం మొదలైన శుభాలు జరుగుతాయి.

          చంద్రుడు లగ్నాత్తుగానీ, దశాథినాథుని స్థానాత్తు గానీ దుఃస్థానములో ఉన్నా, పాపగ్రహాలు కలిసి ఉన్నా నిందలు, కామెర్లు, మనోవ్యాధి, జలభయం, కలహాలు, ధనధాన్యనష్టం, సేవకులతో విరోధం, పశునష్టం, జనఘోష, క్షయ మొదలగు వ్యాధులు, అగ్నిప్రమాదములు, గాయములు, అంగవైకల్యము, దీనత్వము, అవమానములు, నిరుత్సాహము మొదలైన అశుభములు జరుగుతాయి. చంద్రుడు లగ్నాత్తు షష్టాష్టమ వ్యయస్థానములలో ఉన్నట్లైతే.. ఎక్కువగా నష్టాలు వాటిల్లుతాయి.

Tuesday 1 December 2015

రవి మహాదశలో రవి అంతర్దశా ఫలితాలు

రవి శుభుడుగా ఉన్నప్పుడు ధర్మకర్మలు, యుద్ధకర్మలందు ధనలాభం, ధనధాన్య లాభం, ఉద్యోగం, రాజాదరణ, ఆస్తివృద్ధి, ప్రయాణములు, విదేశ పర్యటన, బ్రాహ్మణ, క్షత్రియుల ద్వారా ధనలాభం మొదలైనవి కలుగుతాయి. రవి అశుభుడిగా ఉన్నప్పుడు వ్యర్థ ప్రయాణాలు, జ్వరములు, పితృమరణము, అపమృత్యు భయం, మనఃక్లేశములు, మొదలైనవి జరుగుతాయి.

          రవి 3,6,10,11 స్థానాల్లో ఉన్న ధన సంపాదన, కార్యసిద్ధి, విజయములు, పుత్రపాప్తి, ఉద్యోగాలు కలుగుతాయి. రవి లగ్నాత్తు గాని, దశాధినాథుడి నుంచి గాని 1,2,4,5,7,8,12 స్థానాల్లో ఉన్న నిందలు, కలహములు, భూమి అమ్ముట, స్థాన భ్రష్టత, తండ్రికి కష్టాలు, నష్టాలు, రోగాలు, గాయములు మొదలైన అశుభ ఫలితాలు కలుగుతాయి.

Monday 30 November 2015

అంతర్దశ ఫల నిర్ణయములు

శుభగ్రహ దశో, అశుభగ్రహ దశో వచ్చిందని ఆకాలం మొత్తం ఒకే రకంగా ఉంటుందని భావించకూడదు. ఒక గ్రహదశలో ఇతర గ్రహముల సంబంధములు, స్థానములను బట్టి శుభములు, అశుభములు రెండూ కలుగుతాయి. దశాధినాథుడు పాపి అయినను, అంతర్దశానాథులు కేంద్ర కోణములందు లాభస్థానంలో శుభులై శుభరాశుల్లో స్వ ఉచ్ఛ మిత్ర రాశులలో ఉంటే శుభాలే జరుగుతాయి.

            దశాథినాథుడి కన్నా అంతర్దశానాథుడు ఎక్కువ బలం కలిగి ఫలాన్నిచ్చేవాడుగా ఉన్నప్పుడు దశాధినాథుడ్ని వదిలి అంతర్దశానాథుని ఫలములనే స్వీకరించాలి. అదే విధంగా దశాధినాథుడు శుభుడై అంతర్దశానాథుడు అశుభుడై ఉంటే.. అప్పుడు కూడా అంతర్దశలో ఫలితాలే వస్తాయి. కాబట్టి తొమ్మిది మహాదశలకు అంతర్దశలు చెప్పబడ్డాయి. అంతర్దశానాథుడున్న స్థానబలమును బట్టి భావకారకత్వములతో సమన్వయం చేసి జ్యోతిష్యము చెప్పాల్సి ఉంటుంది.

Sunday 29 November 2015

శుక్ర మహాదశ ఫలితాలు

శాస్త్రజ్ఞానం, లలితకళలపై మక్కువ, కవిత్వం, రచనాకార్యములు, నూతన క్రియలు, తీర్థయాత్రలు, విద్వద్గోష్టి, సన్మానములు, గ్రామాధిపత్యము, తటాకాది నిర్మాణము, ధనప్రాప్తి, సుఖములు, భోగములు, ధనవృద్ధి, వస్తువాహనాదులు, వాణిజ్యలాభం, అధికారుల ఆదరణ, పాలకుల ఆశ్రయం వలన లాభము, తల్లిదండ్రులకు సుఖము, సోదర లాభం, విద్యాలాభం, యుద్ధ విజయం స్త్రీలతో స్నేహం వంటివి శుక్ర మహాదశలో శుక్రుడు శుభుడై ఉన్నప్పుడు కలుగుతాయి.

            అతికామం, పరాంగనాసక్తి, కళత్రదోషం, వియోగం, విడాకులు, వ్యసనాలు, దొంగతనం, బంధు విరోధం, వ్యవసాయ నష్టం, ధననష్టం, శిరోబాధ, శత్రువులతోబాథలు, భార్యాపుత్రుల కలహాలు, స్నేహితులతో విరోధం, కుటుంబ కలహాలు, జనవిరోధం, బంధునష్టం, తండ్రికి పీడ, సర్ప భయం, శీతవాతజ్వరములు, అపమృత్యువు, మనోవ్యధ, వంటివి శుక్రుడు అశుభుడై ఉన్నప్పుడు జరుగుతాయి. మహాదశ ఫలితములు బట్టి జాతకుని జీవనసరళిని కూడా గ్రహించవచ్చు.

Saturday 28 November 2015

కేతు మహాదశలో ఫలితాలు

కేతు మహాదశలో వాహనలాభం, ఉద్యోగం, గ్రామాధిపత్యం, భూవృద్ధి, పశువృద్ధి, భూలాభం, పుత్రలాభం, బంధుమిత్రులతో విందులు, భార్యసంతతికి సుఖము, క్రూరకార్యములందు ధనార్జన, మ్లేచ్ఛుల వలన ధనము, కవిత్వక్రియలు, అధికారులతో స్నేహము, రాజకీయాలలో వృద్ధి, దేవబ్రాహ్మణ ప్రీతి, పెద్దలపై ఆదరణ, ధనవృద్ధి, సుఖము, ఇట్టి శుభములు కలుగుతాయి. కేతు మహాదశలో కేతువు శుభస్థానములో ఉండి శుభదృష్టి కలిగి ఉంటే జరుగుతాయి.

           బంధువిరోధము, వియోగము, దేశ సంచారము, మాతాపితృ వియోగము, పశునష్టము, దీనత్వము, బుద్ధిభ్రంశము, పాపబుద్ధి, సుఖనష్టము, శత్రుభయం, భయములు, కార్యములందు ప్రతికూలత, రాజభయం, చోరభయం, దుష్టులతో కలహాలు, మనోవ్యాధి, అపమృత్యువు, అనారోగ్యం, అంటురోగం, మానహాని, గుండెజబ్బు, స్త్రీ వలన విచారం, ధననష్టం, ధనవంతుల వలన పీడ, ఇతరులకు అన్యాయము చేయు పనులు , విదేశాగమనము వంటివి కేతువు పాపగ్రహములలో కలిసినప్పుడు అశుభుడై ఉన్నప్పుడు సంభవిస్తాయి.